వర్చ్యువల్ అసిస్టెంట్‌షిప్: అంత్రప్రెన్యూర్లు, వృత్తి నిపుణులు, చిన్నపాటి బృందాలకు అడ్మినిస్ట్రేటివ్ కార్యకలాపాల కోసం సిబ్బంది అవసరమవుతారు. సమావేశాల షెడ్యూలింగ్, క్లయింట్లు - ఇన్వెస్టర్లతో టచ్‌లో ఉండటం, వివిధ ఆర్డర్ల ఫాలోఅప్, బిజినెస్ డాక్యుమెంట్ల సృష్టి అంటే పవర్‌పాయింట్ ప్రజంటేషన్లు, ఎక్సెల్ సీట్లు, బ్లాగులు - వెబ్‌సైట్స్ నిర్వహణ వంటివి ఈ పరిధిలోకి వస్తాయి. వర్చువల్ అసిస్టెంట్ల పనిఇక్కడ ముఖ్యంగా వివిధ వ్యవహారాలను సమన్వయపర్చుకుంటూ ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. చాలా బిజీలో ఉండే వ్యక్తులకు సంబంధించిన ఆయా పనుల్లో సహకరించాలి. ఇందుకోసం కొద్దిపాటి శిక్షణ చాలా అవసరం. అలాగే మంచి కమ్యూనికేషన్ నైపుణ్యం ఉండాలి. ఎంఎస్ ఆఫీస్ వంటి అప్లికేషన్స్ తెలియాలి.
అనువాదం: రెండు మూడు భాషలపై పట్టు ఉన్న వ్యక్తులకు ఉపకరించే వృత్తి ఇది. ఇంగ్లీష్‌కు తోడు మరో ఒకటి రెండు జాతీయ భాషలపై ఒక స్థాయిలో అవగాహన, అనువదించే నైపుణ్యం ఉండాలి. ఆయా లాంగ్వేజ్ కోర్సులను చేసి కూడా నైపుణ్యం పొందవచ్చు. పెద్ద సంఖ్యలో స్కాలర్లు, అంతర్జాతీయ బిజినెస్ సంస్థలు ఇలాంటి వ్యక్తుల సేవలను పొందుతున్నాయి. అనువాద సామర్థ్యాలను నిరూపించుకోగలిగితే చాలు, చేసుకోగలిగిన వారి చేసుకున్నంత అన్న రీతిలో అవకాశాలు పొంచి ఉన్నాయి. Fiverr.com or Upwork.com వంటి సైట్లు ఈ విషయంలో సహకరిస్తాయి.
బ్లాగింగ్: బ్లాగుల ఏర్పాటుకు దశాబ్దకాలంగా మంచి ఊపు లభిస్తోంది. గూగుల్ అడసీన్‌లో సంతకంతో ప్లేస్ పొంది సొంతంగా బ్లాగును సృష్టించుకోవచ్చు. వ్యూస్, క్లిక్స్ ఆధారంగా ఆదాయం పొందవచ్చు. బ్లాగ్‌తో అనుబంధ మార్కెటింగ్ లేదంటే ఏవైనా ఉత్పత్తుల అమ్మకాలు చేపట్టవచ్చు. మీ బ్లాగ్ ఎక్కువ మందిని ఆకట్టుకున్న పక్షంలో ప్రకటనలకు అవకాశం కలుగుతుంది. తద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.
ఆన్‌లైన్‌లో ఉత్పత్తుల అమ్మకం: కొవ్వొత్తుల నుంచి వివిధ చేతిపనుల ఉత్పత్తుల అమ్మకాలను ఆన్‌లైన్‌లో సాగించే సదుపాయం ఈ రోజుల్లో ఉంది. అందుబాటులో ఉన్న సరకు తదితరాలతో ఇన్వెంటరీని రూపొందించి ఆయా ఉత్పత్తులకు గిరాకీ కల్పించవచ్చు. అమెజాన్, ఇబే వంటి పోర్టల్స్ ఈ విషయంలో సహకరిస్తాయి. అమ్మకాలకు సహకరించినందుకు కొద్దిపాటి మొత్తాన్ని మీ నుంచి ఈ పోర్టల్స్ వసూలు చేస్తాయి. అమ్మకాలు ఒక్కసారి మొదలైతే చాలు, రవాణా భాగస్వాములు వస్తువులను తీసుకెళ్ళడం మొదలుపెడతారు. వీక్లీ పేమెంట్స్ పొందవచ్చు.
యూట్యూబ్ వీడియోస్: వీడియో కెమెరాను ఉపయోగించడంలో ప్రావీణ్యం ఉంటే యూట్యూబ్‌కు మించిన వేదిక మరొకటి లేదు. ప్రత్యేకించి మీరు ఏ కేటగిరి కిందకు వస్తారో చూసుకుని అందులో నుంచి రాబడి పొందవచ్చు. మీరు ఎంచుకున్న టాపిక్ మాత్రం ఎక్కువ మందిని ఆకట్టుకునేలా చూసుకోవాలి. సరైన ఎక్విప్‌మెంట్ ఉన్నా లేకున్నా పని నడుస్తుంది. అచ్చంగా బ్లాగ్ నిర్వహణ మాదిరిగానే ఇందులోనూ సముచిత అదాయం పొందవచ్చు.
వెబ్ డెవలప్‌మెంట్: వెబ్ డిజైన్‌పై అవగాహన చాలా ముఖ్యం. ఆ నైపుణ్యం ఉంటే, ఇంటి నుంచి వెబ్‌డెవలపర్‌గా పని చేయవచ్చు. వివిధ కంపెనీలు ఔట్‌సోర్సింగ్ కింద ఈ పనిని ఇస్తుంటాయి. అయితే ఈ రంగంలో విపరీతమైన పోటీ ఉందన్న విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి. వెబ్ డిజైనింగ్, ధర నిర్ణయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఎక్కడా బెడిసికొట్టకుండా చూసుకున్నప్పుడే వచ్చిన అవకాశం నిలుస్తుంది.
కంటెంట్ రైటింగ్: ఈ అంశం బాగా ఆదరణ పొందిన ఫ్రీలాన్స్ జాబ్. లోతుగా అధ్యయనం చేసి, ఆకట్టుకునేలా రాసే వ్యక్తులకు ఈ రంగంలో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వ్యాకరణంపై అవగాహన ఉండి, వివిధ అంశాలపై విస్తృతంగా రాసే వ్యక్తులకు ఇంటి నుంచే అదాయం పొందవచ్చు. పేపాల్ అకౌంట్ ఏర్పాటు చేసుకుంటే తద్వారా పనులు పొందవచ్చు.
డేటా ఎంట్రీ: ఆటోమేషన్ దెబ్బకొట్టినప్పటికీ, ఇప్పటికీ అవకాశం ఉన్న రంగమిది. ఈ జాబ్ తీసుకునేందుకు పెద్దగా నైపుణ్యాలు అవసరం లేదు. కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్, టైపింగ్ నైపుణ్యాలు ఉంటే చాలు. ఫాస్ట్‌గా, తప్పుల్లేకుండా టైప్ చేయగలగాలి. ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్లతో అనుసంధానమైతే పని లభిస్తుంది. క్లయింట్ ఇచ్చే ప్రింటెడ్ లేదా స్కాన్డ్ షీట్టలను డిజిటల్ ఫార్మేట్‌లోకి మారిస్తే సరిపోతుంది.
ఆన్‌లైన్ ట్యూటరింగ్: ఇప్పటికే ట్యూటరింగ్‌లో ఉన్న లేదా ఏదైనా సబ్జెక్టులో పట్టు ఉన్న వారికి ఈ రంగం మంచి అవకాశాలను కల్పిస్తోంది. మై ప్రైవేట్ ట్యూటర్, భారత్ ట్యూటర్స్, ట్యూటర్‌ఇండియా.నెట్ వంటి ఆన్‌లైన్ సంస్థలు ఉన్నాయి. ఇందులో మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. అర్హతలు, అనుభవాన్ని బట్టి తీసుకుంటారు. ఆన్‌లైన్ టెస్ట్ లేదంటే టెలిపోన్ ఇంటర్వ్యూతో ఎంపిక జరుగుతుంది. అకడమిక్ ట్యూటరింగ్ మీ అంశమైతే సొంతంగా వర్చువల్ ట్యూటరింగ్ చేపట్టవచ్చు. తద్వారా మీకు ఇష్టమైన సబ్జెక్టు బోధించవచ్చు.
